Tuesday, September 22, 2009

సువర్ణష్ఠీవి

ఒకనాడు సృంజయ మహారాజు కొలువు కిటకిటలాడుతోంది. ఎత్తయిన సింహాసనం మీద నారదమహర్షి కూర్చుని ఉన్నాడు. మహారాజుతో పాటు రాజపురోహితులందరూ ఆ మహర్షిని భక్తిశ్రద్ధలతో పూజించారు.

"మునీంద్రా! మహారాజు మీకు కావలసినవాడు. పైగా ధర్మపరుడు. నిరంతరం అన్నదానాలు చేస్తూ వుంటాడు. మీలాంటి పెద్దల అనుగ్రహం ఉండి కూడా ఆయన కోరిక తీరకపోవడం భావ్యమా?" అని ఒక బ్రాహ్మణుడు నారదుణ్ణి వినయంగా ప్రశ్నించాడు.

"ఆలాగా! ఆ సంగతి నాకు తెలీదు. మహారాజా! ఏమిటి మీ దిగులు! ఇన్నాళ్ళూ నాకు ఎందుకు చెప్పలేదు?" అని నారదుడు అడిగాడు.

"మహర్షీ! మరేం లేదు. గుణవంతుడూ, రూపవంతుడూ అయిన కొడుకు కావాలి నాకు" అన్నాడు సృంజయ మహారాజు.

"అంతే కదా!"

"అంతేకాదు స్వామీ! వాడి మలమూత్రాలు, చెమట, కన్నీళ్ళు, లాలాజలం అంతా బంగారం కావాలి. అలాంటి కొడుకు కావాలి. ఈ వరం నాకు ప్రసాదించండి"

నారదుడు అనుగ్రహించాడు.

సృంజయ మహారాజు పొంగిపోయాడు. సార్వభౌముడై భూమినంతటినీ ఏలుతున్నా సంతానం లేని దిగులు ఇన్నాళ్ళూ అయనను వేధించింది. ఇప్పుడది లేదు. మహాముని వరం వల్ల ఆ కోరిక కూడా తీరబోతోంది. రాజు పరమానందభరితుడయ్యాడు.

మహర్షి మాట ప్రకారం కొన్నాళ్ళకు కొడుకు పుట్టాడు. వాడికి 'సువర్ణష్ఠీవి' అని సృంజయుడు పేరు పెట్టాడు. అతి గారాబంగా వాడ్ని పెంచుకున్నాడు. వాడి వల్ల లభించే బంగారంతో కోట మొదలు పీట వరకూ అన్ని వస్తువులూ బంగారుమయం చేసి వైభవంగా ప్రకాశించాడు.

అలా కొంతకాలం గడిచింది.

ఒకరోజు కొందరు దొంగలు అంతఃపురంలో ప్రవేశించి సువర్ణష్ఠీవిని అపహరించుకుపోయారు. దూరంగా ఒక అడవికి తీసుకువెళ్ళి, అతని కడుపులో బంగారం ఉంటుందనుకొని వాడి పొట్ట చీల్చి చూశారు. మాంసం, ఎముకలు, నెత్తురు తప్పితే ఇంకేం కనిపించలేదు.

అందులో బంగారం లేకపోయేసరికి ఆ శవానక్కడే పారేసి వెళ్ళారు దొంగలు.

తెల్లవారాక సృంజయుడు కొడుకు కోసం అంతఃపురమంతా వెతికించాడు. కనిపించకపోయేసరికి కంగారుపడి నేల నాలుగు చెరగులకూ సేవకుల్ని పంపాడు. చివరకు అడవిలో కొడుకు శవంచూసి బావురుమని ఏడ్చాడు. మృతదేహానికి అంత్యక్రియలు జరిగాక కూడా వాణ్ణే తలుచుకుని కుమిలి కుమిలి రోదించసాగాడు.

సరిగ్గా అదే సమయంలో మళ్ళీ నారదులవారు వచ్చారు. "మహారాజా! నువ్వు ఏడిస్తే మాత్రం చనిపోయిన నీ కొడుకు ప్రాణంతో తిరిగి వస్తాడా? కాలాన్ని తప్పించుకోవాలనుకోవడం అవివేకం. గుణవంతుడు, రూపసి అయిన కొడుకును కోరుకున్నావు. బాగానే వుంది. అంతటితో ఆగక వాడేది ముట్టుకుంటే అది బంగారపు ముద్ద కావాలంటివి! మనిషికి ఆశ ఉండవచ్చు కాని పేరాశ వుండకూడదు. ఉంటే ఇదిగో ఫలితం ఇలాగే ఉంటుంది" అని ఓదారుస్తూనే దేవర్షి మెత్తగా మందలించాడు.

వైభవంగా రాజ్యాన్ని పాలించి, దానధర్మాలు చేసి, పుణ్యాత్ములుగా పేరుపొంది, దేవతల ఆశీస్సులందుకుని కూడా చిరంజీవులు కాలేకపోయిన మరుత్త మహారాజు, అంగరాజు, శిబిచక్రవర్తుల చరిత్రలు వివరించాడు. అ తర్వాత శ్రీరామచంద్ర ప్రభువు గురించి, భగీరథుడి గురించి, శశిబిందుడి గురించి రకరకాల కథలు చెప్పాడు నారదుడు.

"మునీంద్రా! నువ్వు చెప్పిన కథలన్నీ విన్నాక నా పుత్రశోకం తగ్గింది. నీ దయవల్ల నా మనస్సు నిర్మలమయింది" అని సృంజయుడు నారదుడికి నమస్కరించాడు.

నారదుడు సంతోషించి, "నీకేం వరం కవాలో అడుగు ఇస్తాను" అన్నాడు.

"దేవా! నువ్వు ప్రసన్నుడవయ్యావు! ఇంతకంటే కావల్సిందేముంది నాకు?" అన్నాడు వినయంగా మహారాజు.

"సృంజయా! దొంగల మూర్ఖత్వానికి బలైపోయిన నీ కొడుకును మళ్ళీ నీకు తెచ్చి ఇస్తాను. శోకం మానెయ్యి" అన్నాడు నారదుడు.

ఆ దీవెనతో సువర్ణష్ఠీవి సజీవంగా చిరునవ్వు నవ్వుతూ కళ్ళెదుట కనిపించాడు. కొడుకుని చూసి బ్రహ్మానందపడిపోయాడు సృంజయుడు.

తర్వాత సువర్ణష్ఠీవి వివాహం చేసుకొని, సంతానవంతుడై భోగభాగ్యాలు అనుభవిస్తూ, యాగాలు చేస్తూ, దానాలు చేస్తూ చాలాకాలం సుఖంగా వున్నాడు.

కాకి - హంస

పూర్వం ఒకానొక ద్వీపాన్ని ధర్మవర్తి అనే రాజు పాలించేవాడు. ఆ రాజుగారి పట్టణంలో ఒక వర్తకుడుండేవాడు. చాలా మంచివాడు. గొప్ప భాగ్యవంతుడు. ఓ రోజు ఒక కాకి అతని పంచన చేరింది. అతని కొడుకులు దానికి ఎంగిలి మెతుకులు పెట్టి పెంచారు. అది బాగా బలిసి ఏ పక్షులూ తనకు సరిరావని విర్రవీగుతూండేది.

ఒకనాడు సముద్రతీరంలో కొన్ని రాజహంసలు విహరిస్తున్నాయి. వాటిని కాకికి చూపించి "అన్ని పక్షులు కంటే బలమైనదానివి నువ్వు! ఆ హంసల కంటె ఎత్తు ఎగరాలి. సరేనా" అన్నారు వర్తకుని పిల్లలు.

ఎంగిళ్ళు తిని బలిసిన ఆ వాయసం తారతమ్యజ్ఞానం లేక హంసల దగ్గరకు వెళ్ళి తనతో పందానికి రమ్మంది. హంసలన్నీ పకపక నవ్వాయి.

"మానస సరోవరంలో ఉంటాం. మహా బలవంతులం. హంసలతో సరియైన కాకులు లోకంలో ఉన్నట్లు ఎప్పుడైనా,ఎక్కడైనా విన్నావా?" అన్నాయి.

"నూటొక్క గతులలో పరుగెత్తడం చేతనౌను నాకు! ఒక్కొక్క రకం గమనంలో నూరు యోజనాలు వెళ్తాను. మీరెలా కావాలంటే అలా ఎగురుదాం - కావాలంటే పందెం కాద్దాం" అంది కాకి.

"ఆ గతులూ గమనాలూ మాకు తెలీదు! మామూలుగా సముద్రం మీద నిటారుగా ఎగురుదాం. మేమంతా రావటం వృథా. మాలో ఏదో ఒక హంస నీతో పోటీకి వస్తుంది" అన్నాయి మరాళాలు.

అనటమే తడవు ఒక హంస గుంపులోంచి బయటకు వచ్చింది. కాకి కూడా దాని వెనకాలే వెళ్ళింది. రెండూ సముద్రం మీదుగా ఎగరడం మొదలుపెట్టాయి. హంస నెమ్మదిగా వెళుతూంటే కాకి దానికి తన విన్యాసాలను చూపిస్తోంది. హంసను దాటిపోయి, మళ్ళీ వెనక్కి వచ్చి ఎగతాళిగా పిలవడం, ముక్కుమీద ముక్కు మోపడం, జుట్టు రేపుకుని తిరగడం, ఈకలు ఈకలతో రాయడం, నవ్వడం మొదలైన పనులన్నీ చేసింది. హంస చిరునవ్వు నవ్వి ఊరుకుంది. కాసేపటికి కాకి అలసిపోయింది. అప్పుడు పొడుగ్గా ఎగసి పడమరకు పరుగెత్తింది రాయంచ. కాకి ఇంక ఎంతమాత్రం ఎగరలేక రొప్పుతూ బిక్కమొహం వేసింది. హంసను మించలేకపోగా ప్రాణభీతితో వ్యాకులపడింది. 'అయ్యో! నా అవయవాలన్నీ వికలమైపోయాయి. కాసేపు ఎక్కడైనా ఆగుదామంటే పర్వతాలూ, చెట్లూ, లతలూ ఏవి లేవిక్కడ. ఈ సముద్రంలో పడితే మరణమే గతి' అనుకుంటూ భయపడుతూ కళ్ళు తేలేసింది కాకి.

అది చూసి హంస "నీకు చాలా గమనాలు వచ్చన్నావే. గొప్ప గొప్ప విన్యాసాలు చేస్తానన్నావు. ఒక్కటీ చూపవేం వాయసరాజమా?" అంది.

కాకి సిగ్గుపడింది.

అప్పటికే అది సముద్రంలోకి దిగబడి పోవడానికి సిద్ధంగా వుంది. "ఎంగిళ్లు తిని గర్వంతో కన్నూ మిన్నూ గానక నా కెదురెవరూ లేరనీ, ఎంతటి బలవంతుల్నయినా గెలవగలనని అనుకునేదాన్ని. నా సామర్ధ్యమేమిటో నాకిపుడు తెలిసివచ్చింది. నా యందు దయచూపి నన్ను రక్షించు" అంటూ ఆర్తనాదం చేసింది కాకి. నీళ్ళలో మునిగిపోతూ "కావుమని" దీనంగా అరుస్తున్న కాకిని చూసి జాలిపడి హంస తన కాళ్లతో దాని శరీరాన్ని పైకి లాగింది. చావు తప్పించింది.

"ఇంకెప్పుడూ గొప్పలు పోకు" అని మందలించి దానిని తీరానికి విసిరి, ఎగిరిపోయింది రాజహంస.

కాకి లెంపలేసుకుంది.

"అలాగే - వైశ్యపుత్రుల ఎంగిళ్లు తిన్న కాకిలాగ నువ్వు కూడా కౌరవుల ఎంగిళ్ళు తిని అర్జునుణ్ణి ధిక్కరిస్తున్నావు. దీనివల్ల చేటు కలుగుతుంది సుమా!! హెచ్చులకు పోకు" అని యుద్ధభూమిలో డాంబికాలు పలుకుతున్న కర్ణుడికి హితవు చెప్పాడు శల్యుడు.

శీలసంపద

ధర్మరాజు ఇంద్రప్రస్థంలో రాజసూయయాగం చేశాడు. అతని సభావైభవం చూసి అసూయపడి తండ్రి దగ్గరకు వెళ్ళి తన దుగ్ధ వెళ్ళబోసుకున్నాడు దుర్యోధనుడు.

"నాయనా! నీకుమాత్రం తక్కువ ఐశ్వర్యమా? అయితే ధర్మరాజు నీకంటే ఎక్కువగా ప్రకాశించడానికి కారణం అతడు శీలవంతుడు కావడమే. శీలవంతులను లక్ష్మి వరిస్తుంది. కనుక నువ్వు కూడా శీలవంతుడవై సకల సంపదలూ పొందు" అంటూ ధృతరాష్ట్రుడు కొడిక్కి ఓ ఇతిహాసం చెప్పాడు.

"ప్రహ్లాదుడు రాక్షస కులశ్రేష్ఠుడు. సకల విద్యాపారంగతుడు. జనరంజకంగా పరిపాలన చేయగల సమర్ధుడు. ఇంద్ర రాజ్యాన్ని స్వాధీనం చేసుకొని ముల్లోకాలనూ ధర్మయుక్తంగా పరిపాలించసాగాడు. పదవీభ్రష్టుడైన ఇంద్రుడు తనకు ముల్లోకాధిపత్యం మళ్ళీ వచ్చే విధానం చెప్పవలసిందని బృహస్పతిని ప్రార్థించాడు.

బృహస్పతి భార్గవుణ్ణి అడగమన్నాడు.

ఇంద్రుడు వెళ్ళి భార్గవుణ్ణి ఆశ్రయించాడు.

'అతనికి అంత శక్తి ఎలా వచ్చిందో అతన్నే అడిగి తెలుసుకొని ఉపాయంగా ఆ శక్తిని అడిగి పుచ్చుకో' అని సలహా ఇచ్చాడు భార్గవుడు.

"ఇంద్రుడు విప్రుడి వేషం ధరించి ప్రహ్లాదుడికి శిష్యుడై భక్తితో సేవలు చెయ్యడం ప్రారంభించాడు. చాలాకాలం గడిచింది. ప్రహ్లాదుడు ప్రసన్నుడయ్యాడు.

'నాయనా! ఏమి కోరి నన్ను సేవిస్తున్నావు?' అని అడిగాడు.

'అయ్యా! మీకు త్రిలోకాధిపత్యం ఎలా వచ్చిందో తెలుసుకోవాలని వుంది ' అన్నాడు శచీపతి వినయంగా.

'ఏముంది! నేనెప్పుడూ రాజుననే గర్వంతో ప్రవర్తించను. ఎవరినీ నొప్పించను. ఈర్ష్యా, అసూయ, ద్వేషం, పగ మొదలైన దుర్గుణాలేవీ మనస్సులోకి రానివ్వను. ఎవరన్నా ఏదైనా అడిగితే లేదనకుండా సంతోషపెడతాను. పురాకృత పుణ్యం వల్ల బ్రహ్మర్షులు మెచ్చుకునే శీలం వున్నది. కనుక ఇంత మహోన్నత పదవి లభించింది నాకు' అన్నాడు ప్రహ్లాదుడు.

'అయ్యా! నిజంగా నువ్వు మహాత్ముడవు. దానశీలివి. నాయందు దయదలచి నీ శీలం నాకివ్వు' అని ఇంద్రుడు దీనంగా యాచించాడు.

'అయ్యో పాపం! ఎంత దీనంగా అర్థిస్తున్నాడు' అనుకుని 'సరే' అన్నాడు ప్రహ్లాదుడు.

ఇంద్రుడు పన్నిన పన్నాగంలో ప్రహ్లాదుడు చిక్కుకున్నాడు.

ఆ తరువాత ప్రహ్లాదుడి శరీరంలోంచి మహా తేజస్సుతో ఒక పురుషుడు బయటకు వచ్చాడు.

'నువ్వెవరు?' ప్రశ్నించాడు ప్రహ్లాదుడు.

'నేను నీ శీలాన్ని. నువ్వు నన్ను ఆ విప్రుడికి దానం చేశావుగా! అతని దగ్గరకు వెళ్ళిపోతున్నాను' అని వెనుదిరగకుండా వెళ్ళిపోయాడా దివ్యరూపుడు. ఆ వెనుకే ఒక్కొక్క వెలుగూ ప్రహ్లాదుడి శరీరం నుంచి మెల్లిగా బయటకు జారుకుంది.

"నువ్వెవరు మహానుభావా?"

'నేను సత్యాన్ని. శీలాన్ని ఆశ్రయించి ఉంటాను. నేను వేడుతున్నాను'

'నువ్వెవరు?'

'నేను ఋజువర్తనను. సత్యాన్ని ఆశ్రయించి బతుకుతాను. పోతున్నాను'.

'మహాశయా! నువ్వెవరు?'

'నేను బలాన్ని. సత్ప్రవర్తనకు తోడుగా ఉంటాను. శలవు.'

ప్రహ్లాదుడి విషాదానికి అవధులు లేవు.

అతను విచారిస్తుంటే అతిలోక సౌందర్యవతియైన ఒక స్త్రీ అతని శరీరంలోంచి బయటకు వచ్చింది.

'అమ్మా! నువ్వెవరు?'

'నేను లక్ష్మిని. బలం ఎక్కడుంటే అక్కడ వుంటాను. వేడుతున్నాను.'

'అయ్యో తల్లీ! నువ్వూ నన్ను విడిచిపోతున్నావా? ఇంతకూ అంత వినయంగా ఇన్నాళ్ళూ నన్ను సేవించిన ఆ విప్రుడెవరు?' అని సిరిని అడిగాడు ప్రహ్లాదుడు.

'అతను ఇంద్రుడు. నీ వైభవాన్ని ఎగరేసుకుపోవడం కోసం వచ్చాడు. నువ్వు అతని మాయలో పడి నీ శీలాన్ని అతనికి ధారపోశావు. శీలం వల్ల ధర్మం, ధర్మం వల్ల సత్యం, సత్యాన్ని అంటి మంచి నడవడి, దానివల్ల బలం, బలాన్ని ఆశ్రయించి నేను వుంటాం. కనుకనే అన్నిటికి 'శీలం' మూలమని చెప్తారు. నువ్వు అది పోగొట్టుకున్నావు. కనుక ఇంక నీ దగ్గర వుండటం అసంభవం' అని చెప్పి వెళ్ళిపోయింది శ్రీదేవి.

"కనుక - దుర్యోధనా! శీలవంతుడవై వర్థిల్లు నాయనా" అని కొడుక్కి హితవు చెప్పాడు ధృతరాష్ట్రుడు.

సకల జీవుల పట్ల దయతో వుండటం, ఎవరికీ ద్రోహం తలపెట్టకుండా పరులకు ఓపినంతవరకూ మేలు చేయడం, ఎదుటివాడు తప్పుచేస్తే వాడు సిగ్గుపడేలా కాక తన దోషాన్ని చక్కదిద్దుకునేలా బోధించటం, అందరూ మెచ్చుకునేటట్టు మంచిగా ప్రవర్తించడం, పేరాశను విడిచిపెట్టడం శీలవంతుల లక్షణాలు.

Friday, September 18, 2009

నిష్కమ కర్మ

ఒకసారి వేదవ్యాసుడు ధర్మరాజుకు జాబలి కథ చెప్పాడు.

"పూర్వం జాబలి అనే ముని వుండేవాడు. అతడు నిష్ఠగా తపస్సు చేసుకుంటున్నాడు. అతని నెత్తిమీద పిచికలు గూడు కట్టుకుని,గుడ్లు పెట్టుకొని పిల్లలతో హాయిగా కాపురమున్నాయి. జాబలి దయార్ద్ర హృదయుడు కావటం వలన వాటిని తరిమెయ్యకుండా తన నెత్తిమీద అలాగే ఉంచుకున్నాడు.

'ఆహా! నాకున్న ధర్మనిష్ఠ ఇంకెవరికైనా వుందా!' అనుకుంటూ తననితానే మెచ్చుకునేవాడు. ఒకసారి అశరీరవాణి అతని అహంభావాన్ని ఖండిస్తూ 'నీకెంటే ఎక్కువ ధర్మపరుడు తులాధారుడనే వర్తకుడు. అయితే అతను నీ మాదిరి ఎప్పుడూ గర్వపడలేదు' అంది.

"జాబలికి అసూయ కలిగింది. ఆ తులాధారుడెవరో చూడాలనుకుని విసవిస బయలుదేరాడు. వర్తకం చేసుకుంటున్న అతన్ని చూశాడు.

'అయ్యా వచ్చావా! రా! పిచికలు నెత్తిమీద గూడు కట్టుకుని పిల్లలతో సుఖంగా తిరుగుతున్నా చిత్తవికారం లేకుండా తపస్సు చేస్తున్న దయాసాగరా! ఎంత గొప్పవాడివి నువ్వు!!" అని అమితంగా గౌరవించి ఆదరించాడు తులాధారుడు.

జాబలి ఆశ్చర్యపోయాడు.

'ఈ సంగతి నీకెలా తెలిసింది?' అని అడిగాడు.

'మహర్షీ! నాకు దేనిమీదా, ఎవరిమీదా మమకారం లేదు. ధర్మమార్గంలో సంచరించడ మొక్కటే నాకు తెలుసు. ప్రపంచాన్ని రంగస్థలంగా చూసేందుకు నేను ఎప్పుడూ ప్రయత్నిస్తాను. అందుచేత నా మనస్సు దేనికీ ఆకర్షింపబడక తామరాకు మీద నీటి బొట్టులా వుంటుంది. అందువల్లే నీ గొప్పతనం తెలుసుకోగలిగాను' అన్నాడు తులాధారుడు.

'అయితే నేను ధర్మమార్గాన నడవడం లేదంటావా? నా తపస్సూ, యజ్ఞాలు ధర్మాలూ కావంటావా?' అన్నాడు జబలి కొంచెం కోపంగా.

'అహంకారంతో చేసే తపస్సునీ, ఫలం కోరి చేసే యజ్ఞాన్నీ దేవతలు మెచ్చరు. నిత్యతృప్తి అనేది మంచి యజ్ఞం. దానివల్ల దేవతలూ, మనమూ కూడా తృప్తి పొందుతాము' అన్నాడు తులాధారుడు.

'మరైతే నువ్వీ వ్యాపారం ఎందుకు విడిచిపెట్టవు? ధనాశ కాదా ఇది?' అని అడిగాడు జాబలి.

'అయ్యా! కర్తవ్యాలు విడిచిపెట్టడం తగదు. అయినా మనిద్దరికీ వాదం ఎందుకు! నేను చెప్పినదంతా సత్యమో కాదో అడుగుదాం - ఇన్నాళ్ళూ నువ్వు తండ్రిలా పెంచిన నీ పిచికలను పిలు' అన్నాడు తులాధారుడు.

పిలిచాడు జాబలి.

"అవి ముని కేశపాశంలో నుంచి రివ్వున ఎగిరి ఆకాశమార్గాన నిలబడి 'మేము ధర్మదేవత భటులం. ఆయన ఆజ్ఞవల్ల నిన్ను పరీక్షించడానికి వచ్చాం. మత్సరం మంచిది కాదు. అది సర్వధర్మాలనూ నాశనం చేస్తుంది. అందుచేత స్పర్ధ మాని శ్రద్ధగా అవలంబించాలి. శ్రద్ధలేని తపస్సూ, యజ్ఞాలూ వ్యర్థం. శ్రద్ధతో యాగం చేసినవాడు శుచి కాకపోయిన ఫరవాలేదు. శ్రద్ధ లేకూండా యాగం చేసినవాడు శుచి అయినా ప్రయోజనం శూన్యం. శ్రద్ధ వల్ల దానగుణం అబ్బుతుంది. అందువల్ల మేలు కలుగుతుంది. సర్వ సుఖాలూ చేకూరుతాయి ' అని వివరించి మాయమయ్యాయి.

'అయ్యా! మునుల నుంచి తత్త్వజ్ఞానం తెలుసుకోకపోవడం వల్ల నాకీ అసూయ కలిగింది. ఎవరికి వారు తమ తమ విధానాలైన కర్మలు చెయ్యటం మంచిదని నీ నుంచి గ్రహించాను. కాని వాటివల్ల ప్రయోజనం ఆశించకూడదు. అదీ నీ నుంచే తెలుసుకున్నాను. వెళ్ళొస్తాను' అని చెప్పి తులాధారుడి దగ్గర సెలవు తీసుకున్నాడు.

"ధర్మరాజా! ఆచార ధర్మాలు అలాంటివి. సూర్యుడి రూపం నీళ్లలో ప్రతిబింబించినట్లు ఆత్మస్వరూపం నిర్మల బుద్ధిలో ప్రతిబింబిస్తుంది. ఈ శరీరం యావత్తు మహాపట్టణం. దానికి బుద్ధి రాణి. సర్వ విషయాలూ చర్చించే మనస్సు మంత్రి. విషయాలు అయుదూ పురోహితులు. చెవి, ముక్కు మొదలైన ఇంద్రియాలు పౌరులు. ఈ శరీర సామ్రాజ్యంలో రజోగుణం, తమోగుణం అనే మోసగాళ్ళున్నారు. మనస్సు చెప్పిన మాట బుద్ధి వినకపోయిందంటే ఆ మోసగాళ్ల బారినపడి చెడిపోతుంది. మనస్సు, బుద్ధి కలిసి ఏకముఖంగా ప్రయాణిస్తే రాజ్యపాలన చక్కగా సాగుతుంది. శాశ్వత సౌఖ్యం లభిస్తుంది" అని చెప్పాడు వేదవ్యాసుడు.

"మహర్షీ! కార్యసమీక్ష త్వరగా చెయ్యడం మంచిదా? నిదానంగా చెయ్యడం మంచిదా?" అని అడిగాడు ధర్మరాజు.

"కార్యవిచారం చెయ్యడంలో తొందర ఎప్పుడూ పనికిరాదు" అని చెబుతూ ఒక కథ చెప్పాడు వ్యాసుడు.

"మేధాతిథి అనే మునికి చిరకారి అనే కొడుకుండేవాడు. అతడు ప్రతి పనీ బాగా ఆలోచించి చేసేవాడు. యుక్తాయుక్త విచక్షణ తెలిసినవాడు. అందుకే అతనికి ఆ పేరు వచ్చింది. ఒకనాడు మేధాతిథికి భార్య మీద కోపం వచ్చింది. ఆమెను చంపెయ్యమని చిరకారిని ఆదేశించి వెళ్ళిపోయాడాయన.

'నవమాసాలు మోసే కన్నతల్లి కంటే ఈ భూమి మీద ఎక్కువ ఏదీ లేదు. తల్లి దైవమంటారు. ఆమెను చంపటం కంటే పాపం వుందా! కాని తండ్రి ఆజ్ఞ మీరకూడదంటారు. ఏంచెయ్యను? ఇద్దరిమీదా గౌరవం వున్నవాడనే నేను!' అనుకుంటూ చిరకారి చాలాసేపు ఆలోచిస్తూ వుండిపోయాడు. ఆలోచనలో చాలా సమయం గడిచిపోయింది. ఏదో కోపంలో అన్న మాటలు పట్టుకుని కొడుకు తల్లిని ఎక్కడ చంపేశాడోనని విచారపడుతూ, తన కొడుకు అలా చెయ్యడని ధైర్యం తెచ్చుకుంటూ ఆశ్రమానికి వచ్చాడు మేధాతిథి. తండ్రిని చూస్తూనే చిరికారి చేతిలో వున్న కత్తి కిందపడేసి అతని కాళ్ళమీద పడ్డాడు. భార్య వచ్చి నమస్కరించింది. కన్నీటితో ముని భార్యాతనయుల్ని గుండెకు హత్తుకున్నాడు. కొడుకును మెచ్చుకుని దీవించాడు.

"ధర్మరాజా!కార్యవిచారం చాలా ధైర్యంగా, జాగ్రత్తగా చెయ్యాలి. తొందరపడి ఏ పని చేసినా చివరకు పశ్చాతాప పడవలసి వస్తుంది" అని ముగించాడు వ్యాసమహర్షి

గురువు లేని విద్య

ధర్మరాజు, ఆయన తమ్ములు వనవాసం చేస్తున్నప్పుడు లోమశుడు అనే మహర్షి వాళ్లని చూడడానికి వచ్చాడు. కుశలప్రశ్నలు అయిన తరువాత లోమశుడు, "ధర్మరాజా! మీరు తీర్థయాత్రలు చెయ్యండి. మనసు కొంత కుదుటపడుతుంది. తీర్థయాత్రలు చేసుకుంటూ అక్కడి స్థల విశేషాలు తెలుసుకుంటూ కాలక్షేపం చెయ్యండి. కాలం ఇట్టే గడిచిపోతుంది" అని సలహా ఇచ్చాడు.

తరువాత పాండవులు పుణ్యక్షేత్రాలు దర్శించడానికి వెళ్ళారు.

అలా వెళ్ళినప్పుడు వాళ్ళకి గంగానది ఒడ్డున రైభ్యుడనే ఋషి ఆశ్రమం కనిపించింది. ఆ పక్కనే వున్నది భరద్వాజుని ఆశ్రమం.

భరద్వాజుడు, రైభ్యుడు మంచి స్నేహితులు. ఇద్దరు బాగా చదువుకున్నారు. నదీతీరాన పక్కపక్కనే ఆశ్రమాలు ఏర్పరుచుకొని నివసిస్తుండేవారు. రైభ్యుడికి ఇద్దరు కొడుకులు - పరావసు, అర్వావసు.

వాళ్ళిద్దరూ కూడా చక్కగా వేదం చదువుకొని గొప్ప పండితులుగా పేరుపొందారు.

భరద్వాజుడికి ఒక్కడే కొడుకు. అతని పేరు యవక్రీతుడు. యవక్రీతుడికి రైభ్యుడన్నా, ఆయన కొడుకులన్నా గిట్టేది కాదు.

పరావసు, అర్వావసులను చూసి యవక్రీతుడు అసూయపడేవాడు. వాళ్ళకన్నా తను గొప్పవాడు కావాలని ఇంద్రుడ్ని గూర్చి తపస్సు చేశాడు. నిప్పుతో ఒళ్ళంతా మండించుకున్నాడు. ఇంద్రుడికి జాలి కలిగింది. భూలోకానికి వచ్చి, 'ఎందుకు నాయనా ఇంత ఘోరమైన తపస్సు చేస్తున్నావు?' అని అడిగాడు. 'ఎవరూ చదవని వేదవిద్యలన్నీ నాకు రావాలి. నేను గొప్ప పండితుణ్ణి కావాలి. దానికోసం నేనీ కఠోర తపం చేస్తున్నాను. గురువుగారి దగ్గరకు పోవడం, కొన్నాళ్ళు అయనకు సేవ చేయటం అవేవి నాకు కుదరవు. అవేవీ లేకుండా విద్యలన్నీ క్షణాలమీద పొందటానికి ఈ తపస్సు చేస్తున్నాను. నన్ను ఆశీర్వదించండి" అని యవక్రీతుడు వేడుకున్నాడు.

అది విని ఇంద్రుడు నవ్వాడు. "పిచ్చివాడా! నీ తెలివి అపమార్గాన పట్టింది. తక్షణమే వెళ్ళి గురువును ఆశ్రయించు. ఆయన వద్ద శుశ్రూష చేసి వేదవిద్యలన్నీ నేర్చుకో. గురువువద్ద విద్య నేర్చుకుంటేనే ఎవరికైనా చదువు అబ్బుతుంది. అది లేకుండా ఏం చేసినా ప్రయోజనం లేదు" అని చెప్పాడు.

కాని యవక్రీతుడికి ఆయన మాటలు నచ్చలేదు. ఇంకా ఘోరమైన తపస్సు చేశాడు. ఇంద్రుడు మళ్ళీ వచ్చి, "నాయనా! మూర్ఖంగా ఏ పనీ చెయ్యకూడదు. నీ తండ్రిగారికి వేదాలు తెలుసు. ఆయన నీకు నేర్పుతారు. వెళ్ళి వేదవిద్యలన్నీ నేర్చుకో. ఇలా ఒళ్ళు కాల్చుకోవటం మానుకో" అని చెప్పాడు.
యవక్రీతుడికి కోపం వచ్చి, "నేను కోరిన వరం కనుక మీరు ఇవ్వకపోతే నా శరీరంలోని అవయవాలన్నిటినీ విరిచి ఈ అగ్నిగుండంలో పడేస్తాను" అన్నాడు.

అలా వుండగా ఒకనాడు యవక్రీతుడు గంగానదిలో స్నానం చెయ్యడానికి వెళ్ళాడు. అక్కడ ఓ ముసలి బ్రాహ్మణుడు నది ఒడ్డున కూర్చొని పిడికెడు పిడికెడు ఇసుక తీసి నదిలోకి విసురుతున్నాడు. అది చూసి యవక్రీతుడు "ఏం చేస్తున్నావు తాతా?" అని అడిగాడు.

"గంగానది దాటడానికి వంతెన కడుతున్నా" అన్నాడు ఆ వృద్ధ బ్రాహ్మణుడు.

అది విని యవక్రీతుడు పెద్దగా నవ్వాడు. "వేగంగా పోయే ప్రవాహానికి ఇలా ఇసుకతో అడ్డంగా కట్ట వేయడం కుదరని పని. వేరే మార్గం చూడు" అని సలహా ఇచ్చాడు.

"గురువులేకుండానే, అసలు చదవకుండానే, కష్టపడకుండానే విద్య రవాలని కొందరు ఎలా తపస్సు చేస్తున్నారో అలాగే నేనూ గంగానదికి ఇసుకతో వంతెన కడుతున్నా" అని ముసలి బ్రాహ్మణుడు బదులు చెప్పాడు.

అప్పుడు అర్థమైంది ఆ ముసలి బ్రాహ్మణుడు ఎవరో యవక్రీతుడికి! వెంటనే కాళ్ళమీద పడ్డాడు.

ఇంద్రుడు నవ్వుతూ యవక్రీతుణ్ణి దగ్గరకు తీసుకొని, "నీ తండ్రి దగ్గర వేదవిద్యలు నేర్చుకో. అనతికాలంలోనే నువ్వు గొప్ప విద్వాంసుడివి అవుతావు" అని ఆశీర్వదించాడు